సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' ఏదో రూపంలో వార్తల్లో వినిపిస్తూనే ఉంది. కొందరు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తే, మరికొందరు 'ఛీ.. ఛీ.. ఇదేం సినిమా' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి రాధిక ఈ సినిమా పేరెత్తకుండా పరోక్షంగా ఘాటుగా చురకలు అంటించారు. రాధిక సోషల్ మీడియాలో అంత చురుగ్గా ఉండరు కానీ, ఎప్పుడు ఏ పోస్ట్ చేసినా, జనం ఆసక్తిగా మాట్లాడుకొంటారు. ఈసారి ఓ సినిమా పేరు ప్రస్తావించకుండా తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. "మీరెవరైనా ఆ సినిమా చూసి విసుగు చెందారా? నాకు అయితే మూవీ చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఆ మూవీని ఎత్తిపడేయాలన్నంత విరక్తి కలిగింది`` అంటూ ట్వీట్ చేశారు. దానికి తోడు కోపంగా ఉన్న ఎమోజీలను జోడించారు.
''సినిమా పేరు చెప్పొచ్చు కదా'' అంటూ కొందరు, ''ఆ సినిమా యానిమల్ కదా'' అని ఇంకొందరు రాధికకు రీ ట్వీట్లు కొడుతున్నారు. కానీ రాధిక మాత్రం సినిమా పేరు చెప్పడం లేదు. ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమా `యానిమల్` కాబట్టి... రాధిక చెప్పింది ఈ సినిమా గురించే అని అందరూ డిసైడ్ అయిపోయారు. రాధిక మాత్రమే కాదు, చాలామంది సంప్రదాయక సినిమా ప్రేమికులకు ఈ సినిమా నచ్చలేదు. కానీ యూత్ మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే దాదాపు రూ.900 కోట్లు కలెక్ట్ చేసింది. ఈరోజుల్లో డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. ఆ లెక్కన `యానిమల్`ని సూపర్ హిట్ సినిమా అనుకోవాలంతే.