గతేడాది సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ తలపడ్డారు. వారి మధ్య చిన్న హీరో అయిన శర్వానంద్ 'శతమానం భవతి' సినిమాతో వచ్చి మంచి విజయం అందుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలయ్య తలపడనున్నారు. ముచ్చటగా మూడో హీరో సూర్య నటిస్తున్న 'గ్యాంగ్' చిత్రం కూడా సంక్రాంతి రేస్‌లో ఉంది. డబ్బింగ్ సినిమా అయినా కానీ ఈ సినిమాని కూడా పెద్ద సినిమాల జాబితాలోనే వేయాలి. అయితే ఈ రేస్‌లో మరో చిన్న సినిమా పందానికి దిగింది.
అదే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన 'రంగుల రాట్నం'. అసలింతవరకూ ఈ సినిమమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. సడెన్‌గా ఇప్పుడు అప్‌డేట్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుండి వస్తున్న సినిమా ఇది. మూడు పెద్ద సినిమాలతో పోటీకి దిగిందంటే, ఎంతో కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ సినిమాని సంక్రాంతి రేస్‌లోకి దించి ఉంటారు. రాజ్‌తరుణ్‌కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అయితే ఈ మధ్య కొంచెం స్లో అయిన రాజ్ తరుణ్ ఈ సినిమాతో జోరు పెంచే అవకాశాలు లేకపోలేవు.
గతేడాది అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ నుండి వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం..', హలో' చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. అలాగే ఈ సారి సడెన్‌గా సంక్రాంతి బరిలో నిలిచిన 'రంగుల రాట్నం' పై కూడా అంచనాలున్నాయి. గతేడాది సంక్రాంతికి పెద్ద హీరోల మధ్యన సైలెంట్‌గా వచ్చి భారీ వసూళ్లు రాబట్టిన 'శతమానం భవతి' సినిమా మాదిరిగా రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం' కూడా మంచి విజయం అందుకుంటుందేమో చూడాలి మరి. రాజ్ తరుణ్ సరసన చిత్రాశుక్లా హీరోయిన్‌గా నటస్తోంది. శ్రీరంజిని దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా.