మాస్ మహారాజ రవితేజ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. అయితే ఈ గ్యాప్ కి అనేక కారణాలు ఉన్నప్పటికీ తాజాగా ఆయన నటించిన చిత్రం- రాజా ది గ్రేట్ మాత్రం ఆయన అభిమానులకి చాలా రోజుల తరువాత అసలు సిసలైన రవితేజని చూపెట్టగలిగింది.
ఈ సందర్భంగా మనం ముఖ్యంగా మెచ్చుకోవలిసిన వ్యక్తులు ఇద్దరు. వారే దర్శకుడు- అనిల్ రావిపూడి & నిర్మాత దిల్ రాజు. ఒక కమర్షియల్ హీరోని చిత్రం మొత్తం అంధుడిగా చూపెట్టాలనుకునే ప్రయత్నం చేసి అందులో సఫలీక్రుతమైన ఈ ఇరువురికి అభినందనలు.
వీరి మంచి ప్రయత్నానికి రవితేజ సహకారం ఎటువంటిదో ఈ చిత్రం చూసాక మనకి అర్ధమవుతుంది. సాధారణంగా ఇటువంటి పాత్రల చుట్టూ జాలి గొలిపేలా సన్నివేశాలు ఉండటం సహజం, కాని రవితేజ చేసేది ఒక అంధుడి పాత్రయినప్పటికి తన మార్కు హాస్యాన్ని వదలలేదు.
చిత్రం మొత్తంలో ఎక్కువ హాస్య పండించి అదే సమయంలో హీరోకి ఉండే ఆ స్పెషల్ ఎఫెక్ట్ ని ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్సు చేశాడు అనే చెప్పాలి. రొటీన్ కథకి ఇటువంటి ఒక స్పెషల్ హీరోని పెట్టడంతో ఈ చిత్రానికి కొత్త గ్లామర్ వచ్చిందనే చెప్పాలి.
మొత్తానికి మాస్ మహారాజా తనలో టైమింగ్ ని విచ్చలవిడిగా వాడి మనల్ని కావలసినంతగా నవ్వించడంతో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిపోయింది.