ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల పరంగా రికార్డుల దిశగా సాగుతోన్న 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమాకి కొంత మంది హ్యాకర్ల ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయని చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. డబ్బుల కోసమే హ్యాకర్లు ఈ పని చేశారనీ, తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సినిమాని నెట్‌లో పెడతామని బెదిరించారట. పైరసీ భూతం 'బాహుబలి'ని వెంటాడుతున్న మాట వాస్తవమే. దీన్ని అరికట్టడం సాధ్యం కాకుండా పోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ భూతాన్ని తరిమి కొట్టడం ఎవ్వరి వల్లా కాకపోతోంది. 'బాహుబలి' బృందం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు పురోగతిని గురించి తెలుసుకోవడానికై రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి సీసీఎస్ సైబర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులను పట్టుకున్నారనీ, అందుకు పోలీసులకు ఆర్కా మీడియా తరపున కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. ఇంత గొప్ప సినిమా పైరసీకి పాల్పడినందుకు ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. కఠిన శిక్షలు విధించాలి. పోలీసులు వీరి నుండి ఇతరత్రా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాట్నా శివారు గ్రామంలోని ఓ ధియేటర్లో సినిమా డౌన్‌లోడ్ చేశారని నిందితుల నుండి అందిన సమాచారమ్‌గా ఏసీపీ రఘువీర్ వెల్లడించారు.