జక్కన్న అని కొందరు ముద్దుగా పిలిచినా, దర్శక ధీరుడని ఆయన దర్శకత్వ ప్రతిభను కొనియాడినా రాజమౌళి ప్రతిభ ముందు అవన్నీ చిన్న చిన్న ప్రశంసలు మాత్రమే. ఎందుకంటే రాజమౌళి 'అంతకు మించి'న ప్రశంసలకు అర్హుడు. ఓ సినిమాని తెరకెక్కించి, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడటం అనేది అందరూ చేస్తారు. రాజమౌళి కూడా అలాగే చేశాడు, అంతకు మించి కూడా చేశాడు. దేశం గర్వించదగ్గ సినిమా తీస్తూ, చిన్న సినిమాల్ని కూడా ప్రమోట్ చేశాడు. తాను ఓ సినిమా గురించి మాట్లాడితే ఆ సినిమాకి ఎంత క్రేజ్ పెరుగుతుందో రాజమౌళికి తెలుసు. నేనేంటి, పెద్ద దర్శకుడ్ని కదా, చిన్న సినిమాలకెందుకు సపోర్ట్ ఇవ్వాలని ఆయనెప్పుడూ అనుకోలేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు 'బాహుబలి'కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. అందరూ ఆ సినిమాకి ప్రచారకర్తలే. సినిమా విడుదలైంది, దేశమంతా రాజమౌళి ప్రతిభను కొనియాడుతోంది. కానీ రాజమౌళి ఇక్కడే ఇంకా ఇంకా హుందాగా వ్యవహరిస్తున్నాడు. తన పని తాను చేసుకుపోతున్నాడు. లండన్‌లో సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాడు. అక్కడి అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నాడు. లండన్‌లో ప్రచార కార్యక్రమాలు ముగిస్తూ, అక్కడివారికి కృతజ్ఞతలు తెలిపాడు. చిన్నా పెద్దా సోషల్ మీడియాలో ఎవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చినా, వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అవి కూడా రొటీన కృతజ్ఞతలు కాదు, అట్నుంచి వచ్చిన కాంప్లిమెంట్‌కి తగ్గట్టుగా స్పందించాడు. అందుకే దర్శ ధీరుడు - అంతకు మించి అంటున్నది.