రాజమౌళి అంటే దర్శకుడు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. ఇండియాలో ఏ దర్శకుడికీ లేనంత పాపులారిటీ ఇప్పుడు రాజమౌళికుంది. 'బాహుబలి'తో రాజమౌళి అంతలా తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు. దానికి కారణం సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టడం ఒక్కటే కాదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మాత్రమే కాదు, అంతకుమించి రాజమౌళిలో ఓ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ రాజమౌళి సినిమాలకు పెద్ద బ్రాండ్ వేల్యూ.
'బాహుబలి' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకోవడం ఓ ఎత్తు. ఆ సినిమా విడుదలకు ముందే అంతలా జనాన్ని ఎట్రాక్ట్ చేయడం ఇంకో ఎత్తు. ఈ కిటుకు రాజమౌళికి మాత్రమే తెలుసు. అందుకే ఇండియాలో దర్శకులందరిలోకీ రాజమౌళి వెరీ వెరీ స్పెషల్ అయ్యాడు. అలాంటి రాజమౌళి బ్రాండ్‌ని ఫోర్బ్స్ మేగ్జైన్ గుర్తించింది. 2017కు సంబంధించి భారత దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి ర్యాంకులు ప్రకటించింది. ఆ ర్యాంకుల్లో రాజమౌళి పదిహేనవ స్థానంలో నిలిచాడు.
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు పదమూడో స్థానంలో నిలిచింది. రాజమౌళి 55 కోట్ల సంపాదనతో పదిహేనవ స్థానంలో నిలిచాడు. 36.25 కోట్లతో ప్రబాస్ 22వ స్థానంలోనూ, రానా 22 కోట్లతో 36వ స్థానంలోనూ నిలిచారు. మహేష్‌బాబు సంపాదన 19 కోట్లయితే, పవన్ కళ్యాణ్ 11.33 కోట్లు మాత్రమే.
సంపాదన అనే విషయం పక్కన పెడితే, 2017 సంవత్సరానికి సంబంధించి సినిమా పరంగా రాజమౌళిని సూపర్ స్టార్‌గా చెప్పుకోవచ్చు. రాజమౌళిని మించి ఏ సినీ ప్రముఖుడి గురించి ఈ ఏడాది ఇంతలా చర్చ జరిగి ఉండి ఉండదేమో!