సినిమాలో ఓ నటుడు చేసిన తప్పుకి, ఆ సినిమాని శిక్షించాలనుకోవడం సబబు కాదని ఎంతమంది చెబుతున్నా కన్నడిగులు మాత్రం తమ ఆందోళన విరమించడంలేదు. కన్నడలో కొన్ని సంఘాలు, నటుడు సత్యరాజ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనల ప్రభావం 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా మీద పడింది. ఎప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం సత్యరాజ్, కావేరీ జలాల వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యల్ని పట్టుకుని 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాని అడ్డుకుంటామని కన్నడ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం విమర్శలకు తావిస్తోంది.
అయితే ఇలాంటి సందర్భాల్లో విమర్శలకు దీటైన సమాధానం చెప్పకుండా, వివాదానికి స్వస్థిపలికే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. సినిమా కోసం ఏళ్ళ తరబడి తాము కష్టపడ్డామనీ, భారతీయ సినీ ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని అందించాలనుకుంటున్నామనీ ఈ ప్రయత్నంలో తమకు ఇప్పటికే అండగా నిలిచిన కన్నడ ప్రేక్షకులు 'బాహుబలి ది బిగినింగ్'ని ఆదరించినట్లే, 'బాహుబలి ది కంక్లూజన్'ని కూడా ఆదరించాలని కన్నడలో విజ్ఞప్తి చేస్తూ, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారాయన. ఈ ట్విట్టర్ వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. అయితే సత్యరాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్న కన్నడ సంఘాలు మాత్రం రాజమౌళి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించేలా కనిపించడంలేదు.