సినిమా ప్రారంభించే ముందు కథ చెప్పడం రాజమౌళికి అలవాటు. ఓ రకంగా ఎలాంటి సినిమా చూడబోతున్నామనే విషయంలో ప్రేక్షకుల్ని ముందే సిద్ధం చేయడంలాంటిదన్నమాట.
మగధీర, ఈగ, మర్యాద రామన్న సినిమాల విషయంలో రాజమౌళి పాటించిన సూత్రం ఇదే. 'బాహుబలి' విషయంలో మాత్రం జక్కన్న జాగ్రత్తపడిపోయాడు. ఈ సినిమాకి సంబంధించి కథ తనేం చెప్పలేదు. కానీ బయట మాత్రం విస్తృతంగా కథ గురించి ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా 'బాహుబలి 2' సమయంలో అయితే సీన్ బై సీన్ ముందే లీక్ అయిపోయింది. 'ఆర్.ఆర్.ఆర్' విషయంలోనూ ఇదే జరిగింది.
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే.. నాలుగైదు రకాల వెర్షన్లు చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. 'ఆర్.ఆర్.ఆర్' ప్రారంభోత్సవంలో రాజమౌళి ఈ కథ గురించి క్లూ ఇస్తాడేమో అని ఆశించారంతా. అలాగైనా కనీసం ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడుతుందనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం నోరు మెదపలేదు. ఈ ప్రారంభోత్సవానికి మీడియాను దూరంగా ఉంచిన జక్కన్న.. కనీసం ప్రెస్ నోట్ లో అయినా.. ఈ సినిమా ఎలాంటి జోనర్‌లో ఉంటుందో కూడా చెప్పలేదు.
ఎప్పుడూ కథ టూకీగా చెప్పేసే రాజమౌళి... కథ విషయంలో ఇన్ని పుకార్లు, గాసిప్పులు, లీకేజీలూ జరుగుతున్నా... దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి జక్కన్న స్ట్రాటజీ ఏమిటో చూడాలి.