'మగధీర'... రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్. ఓ విధంగా 'బాహుబలి'లాంటి సినిమా తీయడానికి రాజమౌళి సాహసం చేయగలిగాడంటే.. దానికి పునాది 'మగధీర' సమయంలోనే పడిపోయింది. పునర్జన్మలు, రాజకోటలు, కత్తియుద్దాలు.. ఇవన్నీ కలగలిపి... ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు రాజమౌళి. ఇప్పుడు తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'కీ అప్పటి 'మగధీర'కీ ఓ లింకు ఉందట. అదేంటంటే... మగధీరలానే ఇప్పటి 'ఆర్.ఆర్.ఆర్' కూడా పునర్జన్మ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది.
'ఆర్.ఆర్.ఆర్' కథ 1930 నేపథ్యంలో మొదలై... 2018 వరకూ కొనసాగుతుందట. అప్పటి స్నేహితులైన రామ్ చరణ్ - ఎన్టీఆర్, ఈ జన్మలో ఎలా కలిశారు, ఎలాంటి అవతారాలు ఎత్తారు? గత జన్మల ప్రభావం ఈ జన్మలో వాళ్లపై ఎంత వరకూ ఉంది? అనేదే ఈ సినిమాకథ అని తెలుస్తోంది. మగధీరలో చరణ్, కాజల్ చనిపోయి, మళ్లీ పుడతారు. అయితే వాళ్లు ప్రేమికులు, వీళ్లు స్నేహితులు అదే తేడా.
కథలో పోలికలు ఉన్నా... దాన్ని తెరకెక్కించడంలో మాత్రం రాజమౌళి తప్పకుండా ఓ కొత్తదారిలో వెళతాడన్నది జగమెరిగిన సత్యం. మరి ఈ పునర్జన్మ కథని రాజమౌళి ఎలా తెరకెక్కించాడన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.