రాజమౌళి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. తమిళ సినీ పరిశ్రమని కూడా అంతే. తమిళ 'బాహుబలి-2' ప్రమోషన్ కోసం చెన్నయ్‌కి తాజాగా వెళ్ళిన రాజమౌళి, అక్కడ అనర్గళంగా తమిళంలో మాట్లాడేసి తమిళ తంబిల మనసుల్ని గెలిచేసుకున్నాడు. దాంతో తమిళ తంబిలు, 'టచ్ చేశావు రాజమౌళీ' అంటున్నారు. తమిళంలో మాట్లాడటమంటే ఒకటీ రెండు మాటలు మాట్లాడేసి ఊరుకోవడం కాకుండా, అనర్గళంగా మాట్లాడటం రాజమౌళి ప్రత్యేకత. తెలుగులో మాట్లాడేటప్పుడే రాజమౌళి ఎక్కువగా ఇంగ్లీషు ఉపయోగిస్తాడు. అయితే తమిళంలో మాట్లాడేటప్పుడు చాలా అరుదుగా మాత్రమే ఇంగ్లీషు పదాల్ని టచ్ చేశాడు. తమిళ తంబిలకు మనతో పోల్చితే బాషాభిమానం ఎక్కువ. అది పట్టేసినట్టున్నాడు రాజమౌళి. 'బాహుబలి-2' ఈవెంట్ చెన్నయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అనుష్క, తమన్నా సహా పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమన్నా తెలుగుతోపాటు తమిళం కూడా బాగా మాట్లాడుతుంది కాబట్టి, ఆమెకి కూడా సమస్య రాలేదు. అనుష్కకి తమిళం వచ్చినా ఇంగ్లీషుతో మేనేజ్ చేసేసింది. ఏదేమైనప్పటికీ 'బాహుబలి-2' వెండితెర అద్భుతం. దీనికి భాషతో సంబంధం లేదు. అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనడం నిస్సందేహం. దానికి నిదర్శనం 'బాహుబలి ది బిగినింగ్' సక్సెస్సే.