సినిమాలు మానేద్దామనుకునేంత అసహనానికి గురైన సమయంలో హీరో రాజశేఖర్ దగ్గరకి 'గరుడవేగ' సినిమా స్క్రిప్ట్ వచ్చింది. ఆ టైమ్‌లో ఎలాంటి స్క్రిప్ట్ వచ్చినా అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. దానికి కారణం, వరుస ఫెయిల్యూర్స్ ఇచ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ మాత్రమే. అందుకే రాజశేఖర్ 'నేనే రాజు నేనే మంత్రి' సబ్జెక్ట్‌నీ వదులుకున్నాడు. కానీ ఎందుకో 'గరుడవేగ' సినిమా స్క్రిప్ట్‌ని మాత్రం వదులుకోలేకపోయాడు. 'నేనే రాజు నేనే మంత్రి' పెద్ద ఖర్చయ్యే సబ్జెక్ట్ కాకపోయినా రాజశేఖర్ దాన్ని వదిలేశాడు. 'గరుడవేగ' సినిమా బడ్జెట్ ఎక్కువే అయినా వదల్లేదు. సక్సెస్ రాజశేఖర్‌కి రాసిపెట్టి ఉందనడానికి ఇదే ఉదాహరణ. ఎంత పెద్ద సక్సెస్ రాజశేఖర్ ఈ సినిమాతో కొట్టాడో తెలుసా? రాజశేఖర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అనేంతలా. 2017లో వచ్చిన టాప్ టెన్ మూవీస్‌లో ఖచ్చితంగా 'గరుడవేగ' ఉంటుంది. అన్నీ కలిసొస్తే, టాప్-5లోకి కూడా ఈ సినిమా చేరొచ్చట. వీకెండ్ వరకూ అదిరిపోయే వసూళ్ళు వచ్చాయి. వీకెండ్ తర్వాత కూడా వసూళ్ళ జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్‌ని ఊహించలేదనీ, మంచి సినిమా అవుతుందని మాత్రం అనుకున్నామని హీరో రాజశేఖర్ చెప్పారు. ఇంత పెద్ద హిట్ కొట్టినా రాజశేఖర్‌కి ఒకటే లోటు, అదేంటంటే ఈ సక్సెస్‌ని ఆయన తల్లి చూడలేకపోవడం. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని తనకు నమ్మకం ఉందని చెప్పిన రాజశేఖర్, అదే మాట తన తల్లికి కూడా చెప్పేవారట. 'ఈ సినిమా ఖచ్చితంగా చూస్తాను' అని ఆమె కూడా అన్నారట. 'నా సక్సెస్‌ని నా తల్లికి చూపించలేకపోయాను, అదొక్కటే బాధగా ఉంది' అని రాజశేఖర్ చెమర్చిన కళ్ళతో చెబుతున్నారు. ఏదేమైనప్పటికి రైట్ టైమ్‌లో దిమ్మతిరిగే హిట్ రాజశేఖర్ సొంతమైంది.