సినిమాకి మంచి టైటిల్ పెట్టడం కూడ ఒక కళే. రిపీట్ కాకూడదు. కొత్తగా వుండాలి, క్యాచిగా వుండాలి. టైటిల్ లో ఒక వైబ్రేషన్ వుండాలి. ఇలా చాలా లెక్కలు వుంటాయి. అయితే దర్శకుడు పవన్ సాదినేని మాత్రం ఒక పాపులర్ తెలుగు టైటిల్ ని ఇంగ్లీష్ లోకి అనువాదించి కొత్త కలర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. హీరో రాజశేఖర్ , పవన్ సాదినేని కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి 'మాన్‌స్టర్' అనే పేరు పెట్టారు.
'మాన్‌స్టర్' అంటే తెలుగులో రాక్షసుడు. ఈ టైటిల్ తో చిరంజీవి ఖాతాలో ఒక సినిమా వుంది. హీరో సూర్య ఒక డబ్బింగ్ సినిమా కూడా ఇదే పేరుతో వుంది. అలాగే బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కూడా రాక్షసుడు టైటిల్ తో ఒక హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు దాన్నే ఇంగ్లీష్ లోకి అనువాదించి 'మాన్‌స్టర్'గా టైటిల్ ని పెట్టుకున్నారు. గ్యాంగ్‌స్టర్, పోలీసులు నేపధ్యలో సాగే కథ ఇది. మల్కాపురం శివ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత.