రజనీకాంత్ సినిమా అంటే ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా తన సినిమాలు భారీ వసూళ్లు అందుకుంటాయి. ఒక్కోసారి తమిళ నాట కంటే తెలుగులోనే మంచి వసూళ్లు వస్తాయి. `చంద్రముఖి` తమిళంలో కంటే తెలుగులో గొప్ప వసూళ్లు అందుకుంది. రోబో విషయంలోనూ అదే జరిగింది. అందుకే.. రజనీ సినిమా అంటే టాలీవుడ్ లో భారీ క్రేజ్. తన సినిమా హక్కుల్ని కైవసం చేసుకోవడానికి బడా నిర్మాతలు క్యూ కడతారు. ఇప్పుడు వాళ్ల దృష్టి `అన్నాత్తై` పై పడింది.
రజనీకాంత్ నుంచి వస్తున్న కొత్త సినిమా ఇది. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమా తెలుగు హక్కుల్ని సురేష్ బాబు, నారాయణ్ దాస్ కలిసి కైవసం చేసుకున్నారు. రేటు రూ.12 కోట్లకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకి `పెద్దన్న` అనే పేరు పెట్టారని సమాచారం. అన్నచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ ఇది. రజనీ చెల్లాయిగా కీర్తి నటిస్తోంది. నవంబరు 4 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళి సీజన్‌లో వచ్చే సినిమా కాబట్టి, వసూళ్లు అదిరిపోయే ఛాన్సుంది.