`మా` అధ్యక్షుడిగా విష్ణు గెలుపు వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, శ్రీకృష్ఱ పాత్రధారి నరేష్. అసలు `మా` ఎన్నికల తంతు అంతా ఈయన చుట్టూనే తిరిగింది. ప్రకాష్ రాజ్ వర్గం విష్ణుపై కంటే, నరేష్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. నరేష్ ని టార్గెట్ చేసింది. ఇప్పటికీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కీ, నరేష్ కీ మధ్య వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 11మంది ఈసీ సభ్యులు రాజీనామా చేసేటప్పుడు కూడా నరేష్ ప్రవర్తనని తప్పు బడుతూ మాట్లాడారు.
`నరేష్ తో జాగ్రత్త.. నరేష్ ని నమ్మొద్దు` అంటూ విష్ణుకి సలహాలు ఇచ్చారు. ఇప్పుడు నరేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన తరవాత ముండమోపిలా ఏడుస్తున్నారని, ఏడ్చే మగాళ్లని అస్సలు నమ్మొద్దని ఘాటు కామెంట్లు చేశారు నరేష్. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని, ఇప్పుడు రాజీనామా చేసి, బయటి నుంచి ప్రశ్నిస్తా అంటే - ఈసారి ఆ ఓట్లు కూడా రావని, విష్ణుని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, తనని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోమని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు సలహా ఇచ్చారు నరేష్.
`మా` సభ్యుల మద్దతు తమవైపే ఉందని, అందుకే విష్ణు గెలిచాడని, మానిఫెస్టోలో ప్రకటించినట్టే, పనులు జరుగుతాయని, విష్ణుకి ఆ సమర్థత ఉందని నరేష్ చెప్పుకొచ్చారు.