సోషల్ మీడియాలో అబిజీత్ సైన్యం అనూహ్యంగా పెరిగిపోతోంది. సాధారణంగా బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోల ద్వారా ఆయా వ్యక్తులకు అభిమానం అనేది దక్కడం చాలావరకు తాత్కాలికమే. చాలా అరుదుగా మాత్రమే, బిగ్‌బాస్ ద్వారా స్టార్లుగా ఎదుగుతుంటారు. శివబాలాజీ విషయాన్నే తీసుకుంటే, బిగ్‌బాస్ టైటిల్ విజేత అయినా, అతనికి అదనంగా కలిసొచ్చిందేమీ లేదు ఆ రియాల్టీ షో ద్వారా. రాహుల్ సిప్లిగంజ్ కూడా అంతే.
కౌశల్ మాత్రం అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇంకా కౌషల్‌కి క్రేజ్ కాస్తో కూస్తో కొనసాగుతోందంటే అది బిగ్‌బాస్ పుణ్యమే. అయితే, కౌశల్ కూడా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ ద్వారా అభిమానుల్ని సంపాదించుకోగలుగుతున్నాడనుకోండి.. అది వేరే సంగతి. మరి, అబిజీత్ పరిస్థితేంటి.? ఓ సినిమాలో నటించాడు, అతనెవరో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, అతని ఆర్మీ మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.. కౌశల్ స్థాయిలోనే హంగామా నడుస్తోంది అబిజీత్ విషయంలో.
ఆ అత్యుత్సాహంతో కొందరు అబిజీత్ అభిమానులు, కింగ్ నాగార్జునని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. నాగ్, ఏం మాట్లాడినా.. అదంతా బిగ్‌బాస్ స్క్రిప్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటప్పుడు నాగార్జునని ట్రోల్ చేసి ఏం ప్రయోజనం.? నాగార్జున ఇగో గనుక ఈ ట్రోలింగ్ ద్వారా హర్ట్ అయితే, పరిస్థితులు ఇంకోలా వుంటాయి. నాగార్జునని అబిజీత్ ప్రసన్నం చేసుకోగలిగితే, బిగ్‌బాస్ తర్వాత కూడా నాగ్ ఆశీస్సులు ఆయనకి వుంటాయి. అయితే, అభిమానుల అత్యుత్సాహం నాగార్జునకి తెలియనిది కాదు.