సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలిశారు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో సూపర్ స్టార్ అభిమానులను ఆత్మీయంగా పలకరించారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి రజనీ క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రాజకీయాల్లోకి రావడం పట్ల అంతగా ఆశక్తి లేదనీ, ప్రస్తుతం తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదనీ అభిమానులకు తెలిపారు. అలాగే శ్రీలంక పర్యటన విషయంలో కూడా రజనీ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు రజనీ అభిమానులతో భేటీ కానున్నారు. తన కొత్త సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం 'రోబో 2.0' సినిమాలో రజనీ నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాంకేతికతకు పెద్ద పీట వేసిన సినిమా ఇది. 'రోబో'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా 'రోబో 2.0'. రోబో సినిమాని మించి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. మరో పక్క 'కబాలి' డైరెక్టర్ పా రంజిత్‌తో ఓ సినిమా చేయబోతున్నారు రజనీ. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అభిమానులకు తెలిపారు. ఈ కాంబినేషన్లో వచ్చిన 'కబాలి' విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది విడుదలకి ముందే. ఏ సినిమాకీ లేనంత పబ్లిసిటీ జరిగింది ఆ సినిమాకి. అయినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సారి రాబోయే ఈ కాంబినేషన్లో మూవీ అభిమానుల అంచనాలకి తగ్గట్లుగా, సూపర్ స్టార్ ఇమేజ్‌కి ఏమాత్రం మించకుండా ఉండబోతోందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటానని రజనీ అభిమానులతో తెలిపారు.