కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం 2020 సంవత్సరానికి గానూ.... సూపర్ స్టార్ రజనీకాంత్ కు వరించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అధికారికంగా ప్రకటించారు. 70 ఏళ్ల రజనీ స్టైల్ కి మారుపేరు. వందల సినిమాల్లో నటించి అభిమానుల్ని అలరించారు. ప్రపంచ వ్యాప్తంగా తనకు లెక్కలేనంత మంది అభిమానులున్నారు.
రజనీ పంచ్ డైలాగులకు ప్రసిద్ధి. `ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే`, `సింహం సింగిల్ గా వస్తుంది` లాంటివి రజనీ మార్క్ ట్రేడ్ డైలాగులు. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే కథానాయకుల జాబితాలో రజనీ తొలి వరుసలో ఉంటాడు. సెలబ్రెటీలలోనూ ఆయనకు అభిమానులున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం `నేను రజనీ అభిమానిని` అని గర్వంగాచెప్పుకుంటారు. షారుఖ్ అయితే.. రజనీ కోసం ఓ పాటే డిజైన్ చేసేశాడు. రాజకీయాల్లోకి వస్తే.. తప్పకుండా ప్రభావితం చూపించే సెలబ్రెటీల పేర్లలో రజనీ పేరు కూడా ఉంటుంది. కానీ ఆయన రాజకీయాల్లో చేరినట్టే చేరి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ధ్యాసంతా సినిమాలపైనే. ఈ దాదా సాహెబ్ ఫాల్కే... ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.