తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల విషయంలో కంప్లీట్ క్లారిటీతో ఉన్నారు. రాజకీయాల గురించి ప్రశ్నిస్తే మాత్రం కన్‌ఫ్యూజనే ఆయన్నుంచి సమాధానంగా వస్తోంది. అయినప్పటికీ కూడా అభిమానులు తమ అభిమాన హీరో సినిమాల విషయంలో చూపుతున్న వేగానికి మురిసిపోతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం 'కాలా' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. చెన్నయ్ షెడ్యూల్ అయిపోయాక, ముంబైకి బయల్దేరాడు. అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేస్తారు. చెన్నయ్‌లోనూ, ముంబైలోనూ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. చాలావరకు షూటింగ్ ముంబైలోనే జరగనుండగా, కొన్ని సీన్స్‌ని చెన్నయ్ శివార్లలో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇదివరకు అనారోగ్య సమస్యలతో బాధపడిన రజనీకాంత్ ఇప్పుడు మాత్రం కంప్లీట్ ఎనర్జీతో ఉన్నారట. అందుకే చెన్నయ్ టు ముంబై చక్కర్లు కొట్టాల్సి వచ్చినా ఏమాత్రం అలసట ప్రదర్శించడంలేదని చిత్ర యూనిట్ అంటోంది. చెన్నయ్‌లో షూటింగ్ జరిగితే అభిమానులకు ఏదో ఒక రకంగా రజనీకాంత్ టచ్‌లో ఉంటున్నారు. ఇదివరకెప్పుడూ రజనీకాంత్ ఇంతలా తమతో మమేకం కాలేదని అభిమానులే చెప్పడం ఆశ్చర్యకరం. రజనీకాంత్ 'కాలా' సినిమా షూటింగ్ దశలో ఉండగా, 'రోబో 2.0' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ గ్రాఫిక్స్ వంటి పనుల కారణంగా 'రోబో 2.0' సినిమా విడుదల కాస్త ఆలస్యమవుతోంది. ఏదేమైనప్పటికీ రాజకీయ గందరగోళం నడుమ సినిమాలకు సంబంధించి రజనీకాంత్ స్పష్టమైన వేగంతో ముందడుగు వేస్తుండడం గొప్ప విషయంగానే పరిగణించాలి.