సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక రజినీకాంత్ సినిమా విడుదలకి ముందు ఉండే క్రేజ్, హైప్ ఈ చిత్రానికి కూడా పెద్ద స్థాయిలోనే ఉండింది. అయితే సినిమా మాత్రం ఆ అంచనాలని అందుకోవడంలో విఫలమైంది అనే చెప్పాలి.
దర్శకుడు పా. రంజిత్ చిత్రాలలో సామాజిక సమస్యల పైన దృష్టి పెట్టడం చూస్తూనే ఉంటాము. ఈ కాలా చిత్రం కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. ఇదే సమయంలో రజినీకాంత్-రంజిత్ కలయికలో వచ్చిన కబాలి చిత్రం కూడా దాదాపు ఇవే అంశాల పైన కేంద్రీకరించబడినది. ఆ చిత్రంలో మలేషియాలో ఉన్న ప్రజల గురించి చెబితే ఈ చిత్రంలో ముంబై ధారావిలో సమస్యల పైన రంజిత కథ రాసుకోవడం జరిగింది.
అయితే కాలా చిత్రం కథనం బలహీనంగా ఉండడంతో రజినీకాంత్ పాత్ర పూర్తి విశ్వరూపం చూపలేకపోయింది, ఇదే సమయంలో కాలా చిత్రం కూడా దాదాపుగా కబాలి చిత్రాన్ని గుర్తుచేసే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురి చేసింది అనే చెప్పాలి.
ఇక పాటలు కూడా అంతగా ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి అని చెప్పొచ్చు. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి, ఒకరకంగా ఇది రజనీకాంత్ స్టార్ స్టామినా అని చెప్పుకోవచ్చు.