జైలర్‌తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు రజనీకాంత్. తన వరుస ఫ్లాపులకు జైలర్ తో చెక్ పెట్టాడు. రజనీ నుంచి వస్తున్న తదుపరి సినిమా `లాల్ సలామ్`. 2024 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే... ఈ సినిమాలో రజనీకాంత్ హీరో కాదు. కేవలం గెస్ట్ రోల్ చేస్తున్నాడంతే. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. రజనీ పాత్ర కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపే ఉంటుంది. రజనీ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆమె కోరిక మేరకు.. రజనీ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయాల్సివచ్చింది. గెస్ట్ రోల్ అయినా... దీన్ని రజనీ సినిమాగానే ప్రమోట్ చేస్తోంది చిత్రబృందం. ఇది ఒక రకంగా రజనీ ఫ్యాన్స్ ని మిస్ గైడ్ చేయడమే.
రజనీకాంత్ సినిమా అంటే ఆ హైప్ వేరుగా ఉంటుంది. అది ఈ సినిమాకి ప్లస్ అవ్వడం ఖాయం. కానీ తెరపై రజనీ అతిథిలా వచ్చి పోతుంటే - రజనీ ఫ్యాన్స్ నిరుత్సాహ పడతారు. రజనీ ఇందులో అతిథి పాత్ర చేశాడన్న విషయాన్ని.. ముందే ఫ్యాన్స్‌కి ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత.. చిత్రబృందానిదే. రజనీ కేవలం పావుగంటే కనిపిస్తాడు అని చెబితే - ఈ సినిమాకి అనుకొన్న స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయా? సంక్రాంతి బరిలో హేమాహేమీలు అంతా వస్తున్నారు. వాటి మధ్య లాల్ సలామ్ నిలబడుతుందా? అనేది పెద్ద ప్రశ్న.