చిత్రం: రూల్స్ రంజన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి
దర్శకత్వం: రత్నం కృష్ణ
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ
సంగీతం: అమ్రేష్ గణేష్
ఛాయాగ్రహణం: దులీప్ కుమార్
కూర్పు: వరప్రసాద్
బ్యానర్స్: స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ: 6 అక్టోబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2/5
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు... కిరణ్ అబ్బవరం. ఇప్పుడు యూత్ హీరోల్లో తనకంటూ ఓ క్రేజ్ ఉంది. తన చుట్టూ నిర్మాతలు ఉన్నారు. రాజావారు- రాణీగారు, ఎస్.ఆర్. కల్యాణ మండపం,వినరో భాగ్యము విష్ణు కథ లాంటి డీసెంట్ హిట్లు పడ్డాయి. అయితే... కొంతకాలంగా కిరణ్ ట్రాక్ తప్పాడు. తనపై నమ్మకాలు పెరిగే కొద్దీ... పరాజయాలు ఎక్కువ అవుతున్నాయి. తన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ తో తీసిన `మీటర్` కూడా బోల్తా పడింది. ఈ నేపథ్యంలో కిరణ్‌కి ఓ హిట్టు కావాలి. ఇలాంటి దశలో `రూల్స్ రంజన్`తో వచ్చాడు. ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ రూల్స్ రంజన్ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని రంజింపచేశాడా, లేదా?
కథ: మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ది తిరుపతి. బాగా చదువుకొని, ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఉద్యోగం సంపాదిస్తాడు. తొలి రోజుల్లో హిందీ రాక ఇబ్బందులు పడినా, ఆ తరవాత అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకొని.. ఆఫీసుపైనే గ్రిప్పు సాధిస్తాడు. ఈ ప్రయాణంలో రూల్స్ రంజన్‌గా మారతాడు. ఆఫీస్ అంతా రంజన్ రూల్స్‌కి భయపడిపోతుంది. రంజన్‌కి టైమ్ అంటే టైమే. ఆ క్రమశిక్షణతో అంతా విసిగెత్తిపోతారు. ఇలాంటి రంజన్ జీవితంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. సనా (నేహా శెట్టి)ని కాలేజీ రోజుల్లో ఇష్టపడినా, తన ప్రేమని చెప్పలేకపోతాడు. ఆ సనానే.. ముంబైలో ఎదురు పడుతుంది. ఓ రోజు సనాకు ఆశ్రయం ఇస్తాడు రంజన్. ఆ ఒక్క రోజులోనే సనాకి రంజన్‌పై ప్రేమ పుడుతుంది. అయితే... తెల్లారే సరికి సనా తన ఊరు వెళ్లిపోతుంది. సనా మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం.. సొంతూరు తిరుపతి వెళ్తాడు. మరి తిరుపతిలో రంజన్‌కి ఎదురైన అనుభవాలేంటి? నిజంగానే సనా రంజన్ ని ప్రేమించిందా, లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: చాలా మామూలు కథ ఇది. ఎలాంటి ట్విస్టులూ టర్న్ లూ లేకుండా సాగిపోతుంటుంది. ప్రతీ కథలోనూ ట్విస్టులు అవసరం లేదు. కథని ఫ్లాట్ గా చెప్పొచ్చు కూడా. అయితే.. అలా చెప్పేటప్పుడు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకొంటారు. అది.. రూల్స్ రంజన్ ఇవ్వలేకపోయింది. తెరపై కామెడీ ఏదో పుట్టించేశాం.. అని దర్శకుడు, నటీనటులు అనుకోవడం తప్ప థియేటర్లలోని ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాదు. నవ్వు అస్సలు రాదు. రంజన్ ముంబైకి వెళ్లడం, అక్కడ హిందీ రాక తిప్పలు పడడం, అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకోవడం, ఆ తరవాత రూల్స్‌రంజన్ గా మారడం ఇవన్నీ చప్పగా సాగిపోతాయి. ఎదుటి ఫ్లాట్ లోకి వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చి కామెడీ చేయించాలని చూసినా వర్కవుట్ అవ్వలేదు. రంజన్ లవ్ స్టోరీలో ఫీల్ లేదు. సనా.. ముంబైలో కనిపించినప్పుడు కథలో కాస్త జోష్ వస్తుంది. ఆ తరవాత మళ్లీ మాయం అయిపోతుంది. ముంబై వదిలి హీరో తిరుపతి వస్తాడు. అక్కడ హీరోయిన్ అడ్రస్ గురించి, ఆమెతో మాట్లాడడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ చాలా డల్ గా ఉంటాయి.
ఊర్లో ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకోవడం, ఆమెతో మాట్లాడడం ఇంత కష్టమా అనిపిస్తుంది. ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ (సుదర్శన్, హైపర్ ఆది, హర్ష) వీళ్ల ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. సుబ్బారాజు, అజయ్ కూడా రొటీన్‌గానే అనిపిస్తారు. క్లైమాక్స్‌లో పెళ్లి మండపం దగ్గర కామెడీ కాస్త వర్కవుట్ అయ్యింది. అది కూడా వెన్నెల కిషోర్ టైమింగ్ వల్ల. అదొక్కటీ మినహాయిస్తే ఈ సినిమాలో మెచ్చుకోదగిన విషయం అంటూ కనిపించదు. రూల్స్ రంజన్ అనేది హీరో క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ కీ కథకీ సంబంధమే లేదు. ఓ పది నిమిషాల పాటు రూల్స్ రంజన్ హడావుడి చూపించి, ఆ తరవాత దాన్ని గాలికి వదిలేశారు. ఫస్టాఫ్ ఓ కథ.. సెకండాఫ్ మరో కథలా అనిపిస్తుంది కూడా.
నటీనటులు: కిరణ్ అబ్బవరం పక్కింటి అబ్బాయిలా కనిపించాడు. పాత్ర పరంగా సూట్ అయ్యాడు. ఎక్కడా అతికి పోలేదు. అయితే తనలోని ఎనర్జీని పూర్తిగా వాడుకోలేదని అనిపిస్తుంది. నేహా శెట్టి సినిమా ప్రారంభమైన గంట వరకూ కనిపించదు. ఇంట్రవెల్ తరవాత చాలా సేపు తన ఎంట్రీ ఉండదు. దాదాపుగా ఆమెది గెస్ట్ రోల్ అనుకోవాల్సిన పరిస్థితి. హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ వీళ్లంతా కామెడీ చేయడానికి చాలా ట్రై చేశారు. ఫస్టాఫ్‌లో కంటే.. పెళ్లి మండపంలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ బాగుంది. మిగిలిన పాత్రలేవీ పెద్దగా గుర్తు పెట్టుకోలేం.
సాంకేతిక వర్గం: సమ్మోహనుడా పాట విడుదలకు ముందే పెద్ద హిట్టు. ఆ పాట తప్పితే.. మిగిలిన పాటలేం గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే. క్వాలిటీ పరంగా... ఈ సినిమా రిచ్‌గా ఏం కనిపించదు. దర్శకుడు రాసుకొన్న స్క్రిప్టు చాలా బలహీనంగా ఉంది. కొన్ని డైలాగులు వింటే.. రైమింగ్ కోసం రైటర్లు ఎంతకైనా పోతారా అనిపించింది. అసలు ఈ కథని ఏం చెప్పి నిర్మాతలతో ఒప్పించాడా? అనే డౌటు కూడా వస్తుంది. హిలేరియస్ ఫన్ రైడ్ జరగాలంటే కథ అవసరం లేదు. కాకపోతే... ఈసినిమాలో కథా లేదు. ఫన్నూ లేదు.
ప్లస్ పాయింట్స్
సమ్మోహనుడా పాట
మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ
ఫైనల్ వర్డిక్ట్: రాంగ్ రంజన్..!