రజనీ అంటే ఓ ప్రభంజనం. తన సినిమాలకు రికార్డులు బద్దలు కొట్టడమే తెలుసు. ఫ్లాప్ సినిమా అయినా సరే, నిర్మాతల్ని లాభాల్లో ముంచేయడం రజనీకాంత్ సినిమాల స్పెషాలిటీ. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా రజనీ అభిమానులు ఉంటారు. తను సినిమాచేస్తే వందల కోట్లు వచ్చి పడతాయి. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు. 70 వయసులో కూడా ఆయన నిత్య నూతన సూపర్ స్టారే.
అయితే అలాంటి రజనీకాంత్ సినిమాల నుంచి శాశ్వతంగా రిటైర్ అయిపోనున్నార్ట. ఆయన నటించిన `పెద్దన్న` చివరి చిత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది కోలీవుడ్ టాక్. రజనీ వయసు ఇప్పుడు 70 ఏళ్లు. తరచూ అనారోగ్యానికి గురవుతున్నారాయన. ఇటీవలే ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇది వరకు కూడా చాలా ఆపరేషన్లు జరిగాయి. శారీరకంగా చాలా వీక్ అయిపోయాడు రజనీ.
పైగా తన అనారోగ్య సమస్యల వల్లే... రాజకీయాల్లో కూడారావడం లేదని ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు ఆయన రాజకీయాలు మానేసి, సినిమాలు చేస్తే.. ప్రజలకు, అభిమానులకు తప్పుడు సంకేతాలు అందుతాయి. అందుకే రజనీ ఇప్పుడు సినిమాలకూ గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు చెప్పిన కథకు గతంలో ఓకే చెప్పారు రజనీ. అయితే ఇప్పుడు ఆ సినిమాని కూడా చేయకపోవచ్చని వార్తలు అందుతున్నాయి. అదే నిజమైతే... పెద్దన్నతో.. ఓసూపర్ స్టార్ కెరీర్‌కి శుభంకార్డు పడినట్టే.