రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం.. ఎప్పటికీ హాట్ టాపిక్కే. దశాబ్దాలుగా ఆ శుభ ఘడియల కోసం రజనీ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రజనీ రాజకీయ ప్రవేశం దాదాపుగా ఖాయమైపోయింది. రజని మక్కల్ మండ్రం అనే పార్టీనీ ఆయన స్థాపించారు. అయితే.. చివరి క్షణాల్లో ఆయన వెనకడుగు వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో, తన అనారోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పి అభిమానుల్ని నిరాశ పరిచారు.
అయితే గత కొన్ని రోజులుగా మరోవార్త తమిళ నాట చక్కర్లు కొడుతోంది. రాజకీయాల విషయంలో రజనీ మనసు మార్చుకున్నారని, ఆయన ఈసారి పక్కాగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. తమిళ మీడియా ఈ వార్తలపై బాగా ఫోకస్ చేసింది. దానికి తగ్గట్టుగానే రజనీ తన అభిమానులతో ఓ కీలకమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదంతా రజనీ రాజకీయ అరంగేట్రం కోసమే అని చెప్పుకున్నారు. అయితే అదే మీటింగ్ లో రాజకీయాలపై రజనీ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
సమావేశం అనంతరం ఓ క్లారిటీ ఇస్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "రజిని మక్కళ్ మండ్రం నిర్వాహకులకు, సభ్యులకు, నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు నా నమస్కారం. నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటించిన తర్వాత, రజనీ మక్కళ్ మండ్రం పని ఏంటి? పరిస్థితి ఏంటి? అని ప్రజలు, మక్కళ్ మండ్రం నిర్వాహకులు, అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను రాజకీయ పార్టీని ప్రారంభించి, అందులో పనిచేయడానికి తగ్గట్టుగా రజనీకాంత్ రసిగర్ నర్పణి మండ్రాన్ని... రజనీకాంత్ మక్కళ్ మండ్రంగా మార్చాను. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాల స్థాయిలోనూ పలు పదవులను, పలు అనుబంధ బృందాలను ఏర్పాటు చేశాం. కానీ కాలం కలిసిరాకపోవడంతో మనం అనుకున్నది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన నాకు లేదు. అందుకే, రజనీ మక్కళ్ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. అనుబంధ బృందాలు కూడా ఇక ఏవీ ఉండవు. ఇప్పుడు రజనీ మక్కళ్ మండ్రంలో ఉన్న కార్యదర్శులు, అడిషనల్, జాయింట్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో ప్రజల సంక్షేమం కోసం.. ఇంతకు ముందు ఉన్నట్టే రజనీకాంత్ రసిగర్ నర్పణి మండ్రం పని చేస్తుంది" అని తెలిపారు రజినీకాంత్. దాంతో రజనీ రాజకీయ అంకం సమాప్తం అయినట్టైంది. రజనీ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తాడన్న అభిమానుల ఆశలన్నీ ఇక ఆవిరైపోయినట్టే.