నిన్నటి వరకూ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా, రాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం - ఎప్పటికీ హాట్ టాపిక్కే. కొంతమంది రజనీ రాజకీయాల్లోకి వస్తాడని, ఇంకొంతమంది రాడని.. రకరకాల చర్చలు. కానీ ఎట్టకేలకు రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమైపోయింది. 2021 ఎన్నికలలో రజనీకాంత్ పార్టీ పోటీ చేయబోతోంది. రజనీ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వచ్చేయడంతో.. తలైవా అభిమానులంతా ఖుషీ అయిపోతున్నారు. కానీ ఇంతలోనే మరో షాక్ ఇచ్చాడు రజనీకాంత్.
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, కానీ ముఖ్యమంత్రి అభ్యర్ది మాత్రం తాను కానని, ఆ పదవిలో మరొకరు ఉంటారని స్పష్టం చేశాడు రజనీ. తాను కేవలం పార్టీ అధ్యక్ష పదవిలో మాత్రమే ఉంటానని తేల్చి చెప్పేశాడు. అంటే రాబోయే ఎన్నికలలో రజనీకాంత్ పార్టీ గెలిచినా - తలైవా ముఖ్యమంత్రి కాడన్నమాట. ప్రజలకు సేవ చేయడానికి పదవులే అవసరం లేదన్నది రజనీ ఉద్దేశ్యం. పైగా ఈ వయసులో ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా తనకు లేదని, ఆ పదవిలో యువతరం ఉంటే మరింత మంచి జరుగుతుందని రజనీ అభిప్రాయ పడుతున్నాడు. రజనీని ముఖ్యమంత్రిగా చూడాలన్నది అభిమానుల ఆశ. అది తీరకుండానే పోతుంది.