డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్ వెర్సస్ వైల్డ్' ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి వర్క్ చేసేందుకు పలువురు ప్రముఖులు ఆసక్తి చూపిస్తారన్న విషయం తెలిసిందే. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా గ్రిల్స్‌తో కలిసి ఈ ప్రోగ్రాంలో కనిపించారు. తాజాగా బేర్ గ్రిల్స్‌తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ డాక్యుమెంటరీ చేశారు. ఈ క్రమంలో షూటింగ్ సమయాన ఆయన గాయపడ్డారంటూ నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పెద్ద పులులు సంచరించే దట్టమైన బందీపూర్ అటవీ ప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది.
ఈ నేపథ్యంలో అనుకోకుండా చెట్టు కొమ్మల పై నుండి జారి పడి రజనీకాంత్ గాయాల పాలైనట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందడం, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సూపర్ స్టార్ రజనీకాంత్ విలేఖర్ల సమావేశంలో అసలు విషయం తెలిపారు. అడవిలో తనకు పెద్దగా గాయాలేమీ కాలేదనీ, చెట్ల కొమ్మలు గీసుకోవడంతో, చిన్న చిన్న గాయాలయ్యాయనీ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ తెలిపారు. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంక్రాంతికి 'దర్బార్' సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.