టాలీవుడ్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కొద్దో గొప్పో సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటికి వసూళ్లూ వస్తున్నాయి. ఈ దసరాకి మూడు సినిమాలు వచ్చాయి. ఆ తరవాత దీపావళి సీజన్ రాబోతోంది. నవంబరు 4న దీపావళి. ఈ సీజన్‌లోనూ మంచి సినిమాలే ముస్తాబవుతున్నారు. వరుడు కావలెను, రొమాంటిక్, మంచి రోజులు వచ్చాయి ఈ దీపావళికే రాబోతున్నాయి. మూడూ చిన్న సినిమాలే అయినా - దేని క్రేజ్ దానిదే. అయితే...ఇప్పుడు ఈ మూడు సినిమాల్నీ రజనీకాంత్ భయపెట్టేస్తున్నాడు.
రజనీకాంత్ నటించిన తమిళ సినిమా `అన్నాత్తై`ని తెలుగులో `పెద్దన్న`గా విడుదల చేస్తున్నారు. నయనతార కథానాయిక. కీర్తి సురేష్‌కీలక పాత్రధారి. ఈసినిమాని సరిగ్గా దీపావళికే విడుదల చేయబోతున్నారు. ఎంత డబ్బింగ్ సినిమా అయినా - అది రజనీకాంత్ సినిమా.కాబట్టి... తెలుగులో భారీ సంఖ్యలో థియేటర్లు ఆ సినిమాకే వెళ్లిపోతాయి. రజనీకాంత్ ముందు ఈ చిన్న సినిమాలు నిలబడతాయా? అన్నదే డౌటు. వరుడుకావలెను ఎట్టిపరిస్థితుల్లోనూ దీపావళికే రావాలని ఫిక్సయ్యింది. మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా డ్రాప్ అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. `పెద్దన్న` ట్రైలర్ గానీ, టీజర్ గానీ తెలుగులో రాలేదు. అది రిలీజ్ అయితే పెద్దన్న సత్తా తెలుస్తుంది. ఈ సినిమాకి బజ్ బాగా ఉంటుందనుకుంటే.. రొమాంటిక్. మంచి రోజులు వచ్చాయి ఇవి రెండూ డ్రాప్ అవ్వడం ఖాయం.