అభిమానులని అలాగే ఎంతోమంది సామాన్య ప్రజానీకాన్ని కూడా గత కొద్దిరోజులుగా తన రాజకీయ ఆగమనాన్ని ఊరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకి తన మనసులోని మాటని బయటపెట్టాడు.
కొద్దిసేపటి క్రితమే, ఆయన తన రాజకీయ పార్టీ గురించి అలాగే రాజకీయాల్లో తన పాత్ర గురించిన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఇక తన పార్టీ ముఖ్య అజెండా- నిజం, పని, అభివృధి. ఇదే సమయంలో తమిళనాట గత కొన్నిరోజులుగా జరుగుతున్న రాజకీయ చర్యలని రజినీకాంత్ తప్పుబడుతూ, తమిళనాడు గురించి బయట ప్రజలు చులకనగా చూసే పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఆయన ప్రసంగం కూడా సినీ ఫక్కి స్టైల్ లో సాగింది. అధికారం వచ్చిన 3 సంవత్సరాలలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని చెప్పి సంచలనం సృష్టించారు. సూపర్ స్టార్ ఎంట్రీ తో తమిళనాట రాజకీయాల ముఖచిత్రం మారిపోయినట్టే అని చెప్పొచ్చు.
రజిని ప్రకటన వెలువడిన వెంటనే ఆయనకీ దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్లు కమల్ హసన్, అమితాబ్ బచ్చన్ తమ శుభాబినందనలు తెలియచేశారు.
చూద్దాం.. రజినీకాంత్ కేవలం సినిమాల వరకే సూపర్ స్టార్ అవుతాడా లేక రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపిస్తాడా?