రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖాయమైంది. `నేను వచ్చేస్తున్నా` అంటూ రజనీ స్వయంగా ప్రకటించేశారు. దాంతో సూపర్ స్టార్ అభిమానుల్లో హుషారు, ఇతర పార్టీల్లో నీరసం ఒకేసారి మొదలైపోయాయి. రజనీకాంత్ రాజకీయంగా ప్రభావం చూపించగల వ్యక్తే. ఆయన అభిమాగగణం ఆ స్థాయిలో వుంది. 2021 మేలో తమిళనాట ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రజనీ పోటీ చేయబోతున్నారు. కాబట్టి.. అన్ని పార్టీలకూ గుబులు పట్టుకొంది. రజనీ క్రేజ్ గురించి ప్నత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని, ఆయనతోనే మార్పు సాధ్యం అవుతుందని నమ్ముతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గం రజనీకి అండగానూ ఉంది. దానికి తోడు.. తమిళనాట రాజకీయ శూన్యత కనిపిస్తోంది. దాన్ని రజనీ మాత్రమే భర్తీ చేయగలరు అనిపిస్తోంది కూడా. అయితే సినిమా స్టార్లు రాజకీయాల్లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. ఎంత స్టార్ డమ్ గడించినా.. రాజకీయాల్లో తమ ఇన్నింగ్స్ ని జీరో నుంచి మొదలెట్టాల్సిందే. తెలుగునాట చిరంజీవి స్టార్ డమ్ చూడండి. ఏ స్థాయిలో ఉండేదో..? కానీ ఆయన18 సీట్లకే పరిమితం అయ్యారు. మరుసటి ఎలక్షన్లు వచ్చేసరికి పార్టీనే లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ పరిస్థితి అంతకంటే దారుణం. ఆయన ఒకే ఒక్క సీటు కే పరిమితం అయ్యారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. గెలిచిన ఒక్క సీటు కూడా లేనట్టే. ఇంతింత స్టార్ డమ్ ఉండి కూడా.. ఓట్లు సాధించలేకపోయారంటే, కచ్చితంగా అది వాళ్ల వైఫల్యమే.
రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. చిరు, పవన్‌ల పరాజయాలు.. రజనీని భయపెట్టడం ఖాయం. కాకపోతే.. తమిళ నాట వ్యక్తి ఆరాధన, వ్యక్తి పుజ ఎక్కువ. అక్కడ బలమైన నేత లేడని అక్కడి ప్రజలు భావిస్తే, రజనీనే రాజకీయ ప్రత్యామ్నాయం అని అనుకుంటే, అతి తక్కువ రోజుల్లో ఫ్యాన్స్ ని ఓటర్లుగా మార్చుకోగలిగితే...రజనీ ప్రభంజనం సృష్టించడం ఖాయం.