రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం.. తమిళనాట మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. నిన్న... చెన్నైలో తన అభిమాన సంఘ నాయకులతో రజనీ ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. `త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తా` అని మీడియా ముందు ఓ డైలాగ్ కొట్టాడు. దాంతో... రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది.
అయితే... ఈసారి రజనీ రాజకీయాల గురించి ఫ్యాన్స్ కూడా పెద్దగా సీరియస్ గా లేరని టాక్. ఎప్పటిలా.. రజనీ కాస్త హడావుడి చేస్తాడని, ఆ తరవాత.. మళ్లీ మామూలైపోతాడని జోకులు వేసుకుంటున్నారు. రజనీ స్వతహాగా భయస్తుడని, అలాంటివాడు రాజకీయాలకు పనికి రాడని విమర్శలూ గుప్పిస్తున్నారు. మరో వర్గం మాత్రం... `రాజకీయాల్లోకి వస్తే రా.. అంతేగానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోకు` అంటూ డిమాండ్లు కురిపిస్తున్నాయి. మరో పార్టీకి మద్దతు ఇచ్చేట్టు అయితే.. రజనీ రాజకీయాల్లోకి రావడమే అనవసరమని వ్యాఖ్యానిస్తున్నాయి. రజనీ ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టుకోవడం, మిగిలిన పార్టీల్ని అప్రమత్తత చేయడానికే తప్ప ఇంకెందుకూ పనికిరాదన్న వాదనా వినిపిస్తోంది. అయితే.. విచిత్రం ఏమిటంటే.. తమిళనాట అన్ని పార్టీలూ.. రజనీ మీటింగుని లైట్ తీసుకున్నాయి. ఎలా చూసినా.. రజనీ రాజకీయ ఎంట్రీ.. తమిళవాసులకు ఇప్పుడు పెద్ద జోక్.