మరో సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఎవరు పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు క్యూ కట్టేస్తాయో, ఎవరి పేరు చెబితే అంచనాలు ఆకాశాన్నంటుతాయో, ఎవరి పేరు చెబితే కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కనీ వినీ ఎరుగని రీతిలో హైప్ క్రియేట్ అవుతుందో ఆయనే రజనీకాంత్ అని అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడీ సూపర్ స్టార్ తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టతను ఇచ్చేశాక, ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. రజనీకాంత్ తిరిగి సినిమాల్లో నటించబోరేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ రజనీకాంత్ నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి 'రోబో' సీక్వెల్ '2.0' అయితే ఇంకోటి 'కాలా'. రెండు సినిమాల నిర్మాణం పూర్తయిపోయింది. ఒకదాని తర్వాత ఇంకోటి విడుదల కానున్నాయి. ఏప్రిల్‌లో '2.0' విడుదల కానుండగా, 'కాలా' సినిమా ఇంకో మూడు నాలుగు నెలల గ్యాప్ తర్వాత విడుదలవుతుందని సమాచారమ్. ఇవి కాకుండా రజనీకాంత్ మరో రెండు సినిమాల్లో నటించడానికి ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని తెలియవస్తోంది.
అభిమాన సంఘాల్ని, పార్టీ విభాగాలుగా మార్చనున్నట్లు రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు రజనీకాంత్ చెప్పడం ద్వారా తగినంత 'గడువు' తీసుకున్నారనే అనుకోవాల్సి ఉంటుంది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలతోనే రజనీకాంత్ రాజకీయ సత్తా ఏంటో ప్రూవ్ కానుంది. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కొనసాగాలని రజనీకాంత్ భావిస్తున్నారనే మాట అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.