దీపావళికి విడుదలైన విజయ్ 'సర్కార్' తమిళ నాట సంచలనాలు సృష్టిస్తోంది. టాక్ మాట ఎలా ఉన్నా... వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. దానికి తోడు.... వివాదాలకూ కేంద్ర బిందువు అవుతోంది. ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.
కొన్ని పార్టీలనూ, ఆ పార్టీలు ప్రకటించిన పథకాలనూ ఈ సినిమాలో కించపరిచారన్నది వాళ్ల వాదన. దీనిపై తమిళనాట విస్తారంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయ్ `సర్కార్`కి అనుకూలంగా మాట్లాడారు. ఓ సినిమాకి సెన్సార్ పూర్తి చేసిన తరవాత కొన్ని సన్నివేశాలు తొలగించాలనో, సినిమాని నిలిపివేయాలనో పోరాటం చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి పోరాటాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
సూపర్ స్టార్ మాత్రమే కాదు.. చాలామంది సినీ ప్రముఖులది ఇదే మాట. ''ఓ పొలిటికల్ డ్రామా విడుదలయ్యాక ఇలాంటి వివాదాలు చెలరేగడం మామూలే'' అని సినీ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వివాదాలు ఈ చిత్రానికి మరింత ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తాయి. రోజు రోజుకి పెరుగుతున్న `సర్కార్` వసూళ్లే ఇందుకు నిదర్శనం.