'సీత' చిత్రం తో మరో డిజాస్టర్ తన ఖాతాలో వెనకేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా 'రాక్షసుడు' చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ హారర్ చిత్రం 'రాత్సాసన్' చిత్రానికి ఇది రీమేక్. గత చిత్రాలతో ప్లాపులని మూటకట్టుకున్న బెల్లం బాబు ఈ సారి చాలా జాగ్రత్త పడుతున్నాడు. కథ ఎంపిక చేసుకోవడం నుంచి తారాగణం, ప్రమోషన్స్ మరియు విడుదల వరకు అన్నీ తానై ఈ చిత్రాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.
దీనికి సంబంధించిన ఒక తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'ఇది నా తొలి చిత్రం గా భావించండి' అని చెప్పాడు సాయి శ్రీనివాస్. నా గత మూడు చిత్రాలు సరిగ్గా ఆడలేదని దానికి కారణం సరైన కథ లేకపోవడమే అని, ఇక నుంచి అన్ని మంచి చిత్రాలే తీయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు.
ఈ చిత్రాన్ని నాకు అందించిన నిర్మాత కోనేరు సత్యనారాయణ గారికి, అభిషేక్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు నామా అభిషేక్ కు కృతజ్ఞతలు తెలిపాడు. రాక్షసుడు చిత్రానికి విలన్ గా నటించిన క్రిస్టోఫర్ నటన హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు.