ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్‌సింగ్‌కి అవకాశాలు లేక, వచ్చిన అవకాశాలతో హిట్లు లేక ఎంత సతమతమవుతోందో తెలిసిన సంగతే. ఈ సమయంలో ఎందుకో తెలీదు ఫ్యాన్స్‌లో విపరీతమైన నెగిటివిటీని పెంచుకుంది. ఆమె నిలుచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పు, చేయకుంటే ఇంకో తప్పు.. ఇలా అన్ని రకాలుగా విమర్శల పాలవుతోంది రకుల్ ప్రీత్‌సింగ్. ఈ తరుణంలోనే ఎట్టకేలకు 'మన్మధుడు 2'తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్‌లో భారీగా ఆశలు పెట్టుకున్న 'దేదే ప్యార్‌దే' సినిమా అంతంత మాత్రంగా నిలిచింది. ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా రకుల్‌కి అంతగా కలిసి రాలేదు ఆ సినిమా కూడా.
ఇక ఇప్పుడైతే 'మన్మధుడే' రకుల్‌ని గట్టెక్కించాలి. ఇదిలా ఉంటే, పాపం ఎందుకో రకుల్‌కి మనసులోని బాధను ఫ్యాన్స్‌తో పంచుకోవాలనిపించిందట. అవునులెండి.. మా సినిమావోళ్లకీ బోలెడు కష్టాలుంటాయ్. ఆ కష్టాలు మీకేం తెలుస్తాయి లెండి.. అసలింతకీ రకుల్‌కొచ్చిన కష్టమేంటంటే, తెర ముందు కనిపించే సక్సెస్, ఫెయిల్యూర్స్‌నే ప్రేక్షకులు లెక్క కడతారు. కానీ, ఓ సినిమా కోసం హీరోయిన్లు తెర వెనక పడే కష్టం అంతా ఇంతా కాదు తెలుసా.. అంటోంది. తెరపై అందంగా కనిపించేందుకు మేం పడే కష్టం మామూలుది కాదంటోంది. డైట్ కంట్రోల్స్, బాడీ షేపింగ్ కోసం కష్టమైన వర్కవుట్లు.. ఇలా ఎంతో కష్టపడాల్సి వస్తుంది.. ఎంత కష్టపడినా దక్కిన ఫలితం పోజిటివ్‌గా ఉంటే ఒక రెస్పాన్స్, నెగిటివ్‌గా ఉంటే ఇంకో రెస్పాన్స్ మొత్తం బాధ్యత హీరోయిన్స్‌దే అన్నట్లు విమర్శిస్తారు. అది మాకు చాలా బాధాకరం.. అటూ రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.