ఇండియన్ సినిమా స్క్రీన్‌పై మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ ఎవరన్న ప్రశ్నకు తడుముకోకుండా వచ్చే సమాధానం శ్రీదేవి. అతిలోక సుందరిగా శ్రీదేవి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఆమె పాత్రలో మరో అందాల భామ వెండితెరపై హల్‌చల్ చేయనుందన్న వార్త, అతిలోక సుందరి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తేయడం ఖాయం. ఆ అద్బుతానికి 'ఎన్‌టిఆర్ బయోపిక్' వేదికయ్యింది.
'ఎన్‌టిఆర్ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' అంటూ, ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు పార్టుల్లో రూపొందిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తళుక్కున మెరవబోతోంది. ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్, రకుల్ ప్రీత్ సింగ్ 'శ్రీదేవి లుక్'ని విడుదల చేసింది. 'చాలా బాగుంది' అనేది చాలా చిన్న మాట. శ్రీదేవితో రకుల్‌ని పోల్చడం సబబు కాదుగానీ, చాలావరకు శ్రీదేవిని మ్యాచ్ చేయడానికి రకుల్ ప్రయత్నించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
సినిమాలో బాలకృష్ణతో రకుల్ ఓ పాటలో డాన్స్ చేయబోతోన్న సంగతి తెల్సిందే. స్వర్గీయ ఎన్టీఆర్ - శ్రీదేవి కలిసి నటించిన ఓ సూపర్ హిట్ సాంగ్ అది. తన కెరీర్‌లోనే ఇది చాలా చాలా ప్రత్యేకమైన సినిమా అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇంత గొప్ప పుట్టినరోజు ఇంతకు ముందెప్పుడూ తనకు రాలేదని చెబుతున్న రకుల్, శ్రీదేవి పాత్రలో తాను నటించడం ఓ అద్భుతమని అభిప్రాయపడుతోంది. నిజమే, శ్రీదేవిలా వెండితెరపై వెలిగిపోవాలని అనుకోని హీరోయిన్ వుండదు. ఆ అదృష్టం ఇప్పుడు రకుల్‌కి దక్కింది.
ఆల్ ది బెస్ట్ రకుల్.