త్రివిక్రమ్‌లో ఓ పాటల రచయిత ఉన్నాడన్న సంగతి తెలుసా?? రచయితగా ఎదుగుతున్న సమయంలో 'ఒక రాజు ఒక రాణి' చిత్రానికి అన్ని పాటలూ తనే రాశాడు. అయితే ఆ తరవాత అలాంటి ప్రయత్నమేం చేయలేదు. అయితే చాలా కాలం తరవాత మళ్లీ 'అరవింద సమేత వీర రాఘవ' కోసం త్రివిక్రమ్ పాట రాశాడని చెప్పుకున్నారు. వేదికపై స్వయంగా సిరి వెన్నెల సీతారామశాస్త్రినే 'రుధిరం అనే పాటని నేనూ, పెంచలదాస్, త్రివిక్రమ్ ముగ్గురూ కలసి రాశాం' అన్నారు.
దాంతో 'రం రుధిరం' అనే పాటలో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉందనిపించింది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌ని అడిగితే ''నేనేం పాట రాయలేదు. అది సీతారామశాస్త్రి, పెంచలదాస్ రాసిన పాటే. నేను అప్పుడప్పుడూ డమ్మీ లిరిక్స్ ఇస్తుంటాను. సీతారామశాస్త్రి గారు పాట రాయడం ఆలస్యం చేస్తుంటనే `మీరు రాస్తారా, నన్నే రాసుకుని మీ పేరు వేసుకోమంటారా` అని బ్లాక్‌మెయిల్ చేస్తా. దాంతో ఆయన కంగారు పడి పాట కాస్త తొందరగా ఇచ్చేస్తుంటారు. అంతకు మించి నేనేం చేయను.. రాయను'' అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
ఆయన దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' ఈనెల 11న విడుదల అవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పూజా హెగ్డే నాయిక. తమన్ సంగీతం అందించారు.