పుట్టినరోజునాడు రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్ద షాక్ తగిలింది. అతిలోక సుందరి శ్రీదేవి గెటప్‌లో తన లుక్‌ని రిలీజ్ చేసిన రకుల్ సోషల్ మీడియాలో ట్రాల్స్‌ని ఎదుర్కోవాల్సి వస్తోంది. నూటికి తొంభైమంది లుక్ చాలా బాగుందని చెబుతూ ఆమెకు విషెస్ అందిస్తుంటే, కొంతమంది మాత్రం 'శ్రీదేవిలా కాదు, శ్రీరెడ్డిలా ఉన్నావ్..' అంటూ రకుల్‌ని ఆట పట్టిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇలాంటివి మామూలే అయినా, మరీ శ్రీరెడ్డితో రకుల్‌ని పోల్చడం అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇదిలా ఉంటే, గతంలో రకుల్ ప్రీత్‌సింగ్‌కీ, శ్రీరెడ్డికీ మధ్య చిన్నపాటి ఓ వివాదం నడిచింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి మాట్లాడితే, అలాంటి అనుభవాలు తనకు ఎదురు కాలేదనీ, రకుల్ చెప్పింది. దాంతో రెక్కపీతా.. చపాతీ ముద్ద అంటూ శ్రీరెడ్డి రకుల్‌పై విరుచుకు పడింది. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేసింది.
తెలుగు సినిమాల్లో అవకాశాల్ని తెలుగమ్మాయిలకు దక్కనీయకుండా రకుల్ లాంటి వాళ్లు ఎగరేసుకుపోతున్నారనీ, దర్శక, నిర్మాతల్ని తమ చుట్టూ తిప్పుకుంటున్నారనీ, శ్రీరెడ్డి ఆరోపించింది.
ఏది ఏమైనా ఎవ్వరేమనుకున్నా అతిలోకసుందరి శ్రీదేవి పాత్ర దక్కడం ఆమెకు అదృష్టమే. ఆ పాత్ర ఆమెను వరించిందంటే రకుల్ మీద 'ఎన్టీఆర్' టీమ్‌కి ఎంత నమ్మకమో అర్దం చేసుకోవచ్చు.