కథానాయిక అంటేనే గ్లామర్. వాళ్లని అందంగా చూడ్డానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. కానీ.. అస్తమానూ గ్లామర్ పాత్రలే చేస్తే విసుగు వస్తుంది. అందుకే అప్పుడప్పుడూ జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టు హీరోయిన్లు రూటు మారుస్తుంటారు. డీ గ్లామర్ పాత్రలు వేస్తూ, తమలోని నటిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేస్తోంది. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం లో ఓ సినిమా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ కథానాయిక.
ఈ చిత్రంలో రకుల్ ది పూర్తిగా డీ గ్లామర్ పాత్ర అని తెలుస్తోంది. మేకప్ కూడా వేసుకోకుండా అత్యంత సహజంగా కనిపించనుందట. తానా నవలల పోటీల్లో ప్రధమ బహుమతి సంపాదించిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రకుల్ ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. అందుకోసమే ఇంత సాహసం చేస్తోంది. మరి ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో?