టాలీవుడ్ లో కథల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథలు రెడీ అవ్వడమే ఆలస్యం.. హీరోలు ఎగరేసుకుపోతున్నారు. ఓ హీరో కాదంటే. మరో హీరో 'ఓకే' చేసి హిట్లు కొట్టిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. అల్లు అర్జున్ వద్దన్న కథని రామ్ ఓకే చేసి, సెట్స్‌పైకి ఎక్కించేశాడు. రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ కథ ముందు బన్నీ దగ్గరకు వెళ్లింది.
బోయపాటి శ్రీను - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'సరైనోడు' రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో బన్నీకి రెండు కథలు వినిపించాడు బోయపాటి. అందులో సరైనోడుని ఓకే చేశాడు బన్నీ. తను వదులుకొన్న రెండో కథని ఇప్పుడు రామ్ తో పట్టాలెక్కించాడు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే.. 'సరైనోడు' కథ ముందు గోపీచంద్ దగ్గరకు వెళ్లింది. గోపీచంద్ రిజెక్ట్ చేస్తే.. కొంతకాలానికి బన్నీతో తీసి, సూపర్ హిట్టు కొట్టాడు బోయపాటి. ఇప్పుడు బన్నీ వద్దనుకొన్న కథని రామ్ తో తీసి ఇంకెంత పెద్ద హిట్టు కొడతాడో చూడాలి.