రాజమౌళి కాంబినేషన్ల గురించి ఆలోచించడు. ఫలానా హీరోకి ఫలానా రకమైన కథ అయితే బావుంటుందని ఆలోచిస్తాడు. ఒక్కోసారి ముందు కథ అనుకుని, ఆ కథకు తగ్గ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటాడు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం రాజమౌళి ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఆయన్ని స్టార్ డైరెక్టర్‌ని చేసేసింది.
నటీనటుల్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా రాజమౌళి అనుసరించే పద్ధతి అందరికీ నచ్చుతుంది. ఫలానా పాత్ర ఫలానా నటుడైతే బావుంటాడని అన్పిస్తే, అతన్ని సంప్రదిస్తాడు. ఎలాగూ రాజమౌళి చెప్పే కథకి ఎవరూ వంకలు పెట్టలేరనుకోండి, అది వేరే సంగతి. రామ్‌చరణ్ కూడా అంతే. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి ఓ మల్టీస్టారర్ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా కథ గురించి తనకేమీ తెలియదని చెప్పేసరికి అంతా షాక్‌కి గురయ్యారు.
రాజమౌళి కథ చెప్పకుండా, కాంబినేషన్‌ని సెట్ చేయడనే అభిప్రాయం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. ఇక్కడ చరణ్, చాలా తెలివిగా వ్యవహరించాడనుకోవాలి. కథ విన్నానని చెబితే, మీడియా ఎలాగోలా అతన్నుంచి విషయాన్ని రాబట్టేస్తుంది. 'తెలియదు, రాజమౌళి మీద నాకు నమ్మకం వుంది' అని కథ గురించి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేస్తే వివాదం వుండదు.
అదీ చరణ్ తెలివి. కానీ ఇక్కడేదో రాజమౌళిని తక్కువగా చరణ్ మాట్లాడానేలా సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించేస్తుండడం గమనార్హం.