మళ్లీ రావా, జెర్సీతో ఆకట్టుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు రామ్ చరణ్‌తో జట్టు కట్టబోతున్నాడు. వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయ్యింది. అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. ఆల్రెడీ కథ కూడా లాక్ చేసేశారు. ఈ సినిమా ఏ జోనర్‌లో సాగుతుంది? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. జెర్సీలానే ఇదో స్పోర్ట్స్ డ్రామా అనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. చరణ్ కి ఎప్పటి నుంచో స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఉంది, దానికి తోడు జెర్సీ కూడా స్పోర్ట్స్ కథనే. అందుకే ఈసారీ అలాంటి జోనర్‌లోనే సినిమా ఉంటుందని అనుకున్నారు. అయితే ఈ ఊహాగానాలకు తెర దించాడు చరణ్.
``ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు. పక్కా కమర్షియల్ సినిమా..`` అని క్లారిటీ ఇచ్చాడు. `నాయక్`, `ఎవడు` స్టైల్‌లో సాగే కథ అని, ప్రతీ సీన్ కమర్షియల్ మీటర్‌లోనే ఉంటుందని... తెలిసింది. గౌతమ్ ఇప్పటి వరకూ కమర్షియల్ స్టోరీని డీల్ చేయలేదు. కాకపోతే.. తనకు మాస్ దర్శకుడిగా నిరూపించుకోవాలన్న తాపత్రయం ఉంది. చరణ్ లాంటి మాస్ హీరో దొరికితే... ఇంకేముంది? సో.. ఈసారి పక్కా కమర్షియల్ కథ రావడం ఖాయం. మే,జూన్‌లలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.