1985 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ పల్లెటూరి కథ. ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగానే స్టైలింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే, సినిమాలో ఎక్కడా నేటి ట్రెండీ అంశాలుండవు. షూటింగ్ కూడా, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలకు దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లో జరిగింది. ఇవన్నీ 'రంగస్థలం' సినిమా గురించి విన్పించిన వార్తలే.
సినిమా కోసం పనిచేసినవారంతా, ఆ సమయంలో తాము పడ్డ ఇబ్బందుల్ని చెబుతూనే, ఆ లోకంలోకి వెళ్ళిపోవడం చాలా కొత్తగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదొక అనిర్వచనీయమైన అనుభూతి అన్నారు. ఇవన్నీ విన్నాక, 'రంగస్థలం' సినిమాపై ఎలా అంచనాలు పెట్టుకోవాలి? అనే అనుమానం సగటు సినీ ప్రేక్షకుడిలో ఏర్పడింది. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయేలా 'రంగస్థలం' ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇదొక సెలబ్రేషన్ అనే స్థాయిలో ఆ లుక్‌ని డిజైన్ చేశారు.
లేటెస్ట్‌గా ఈ రోజు ఈ సినిమా టీజర్ బయటకు రాబోతోంది. అంతకు ముందుగా విడుదలైన తాజా స్టిల్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హీరో చరణ్ కళ్లలోని స్పార్క్‌ని దర్శకుడు సుకుమార్ బాగా ఎలివేట్ చేయాలనుకున్నట్టున్నాడు. వన్ సైడ్ యాంగిల్‌లోనే, ఒకే కన్ను కన్పిస్తున్నా ఆ కంట్లోని పవర్ స్పష్టంగా కన్పిస్తోంది. ఇదొక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్, 1985 నాటి పరిస్థితులు ఇవన్నీ నిజమే అయినా, సినిమా చూసేవారికి ఓ డిఫరెంట్ అనుభూతినివ్వడంతోపాటు, కమర్షియల్ అంశాల్ని ఎక్కడా మిస్ అవలేదట.
చరణ్ సరసన సమంత తొలిసారిగా ఈ సినిమాలో జోడీ కడ్తోంది. బుల్లితెర బ్యూటీ అనసూయ మరో ముఖ్యమైన పాత్రలో కన్పించబోతోంది. ఇన్‌సైడ్ సోర్సెస్ అందించిన సమాచారం ప్రకారం టీజర్‌ని సూపర్బ్‌గా కట్ చేశారట. బ్యాక్‌డ్రాప్ పాతకాలం నాటిదైనా, సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.