అల్లు శిరీష్ హీరోగా నటించిన తొలి సినిమా 'గౌరవం' పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కింది. హీరో తన స్నేహితుడి ఆచూకి తెలుసుకునే ప్రయత్నంలోనే ఆ స్నేహితుడు, స్నేహితుడి లవర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకుంటాడు. అది పరువు హత్య అని తెలిసి, ఆవేదన చెందుతాడు. స్నేహితులతో కలిసి ఆ పరువు హత్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు.
రియల్ లైఫ్‌లో ఓ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోందిప్పుడు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకున్ని దారుణంగా హతమార్చిన ఘటన తెలుగు సినీ ప్రముఖుల్ని కలచివేసింది. ప్రణయ్ భార్యకు తండ్రి అయిన మారుతీరావు ఈ హత్య చేయించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్, రామ్, నిఖిల్ స్పందించారు.
తాజాగా రామ్‌చరణ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాడు. ఏ సమాజంలో ఉన్నాం మనం.? అని ప్రశ్నించాడు. స్పందించింది తక్కువ మందే అయినా, సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను గుర్తెరిగి పరువు హత్యను ఖండించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ సోషల్ మీడియా నినదిస్తోంది.
దేశమంతా ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.