ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే.. 'సలార్'. ఆ తరవాత.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని దానికి 'రావణం' అనే పేరు పెట్టారని ఓ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది రావణాసురుడి కథ. రావణుడి గొప్పదనం చెప్పే కథ. 'ఆదిపురుష్'లో రాముడిగా నటించిన ప్రభాస్... వెంటనే రావణుడిగా నటించడం గొప్ప విషయమే. కాకపోతే... ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. రావణం కథ ప్రభాస్ కోసం కాదని, రామ్ చరణ్ కోసమన్నది అసలు ట్విస్ట్.
రామ్ చరణ్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాలి. ఇది వరకే.. ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయ్యింది. సలార్ తరవాత.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఇదే కావొచ్చు. రావణం కథ చరణ్ కి చెప్పాడని, చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. దాదాపు రెండేళ్లు ఈ సినిమా కోసం కేటాయించబోతున్నార్ట. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే ఖరీదైన సినిమా ఇదేనని టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ కాంబోలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.200 కోట్లు. 'రావణం' కోసం రూ.250 కోట్లు ఖర్చు పెట్టడానికి దిల్ రాజు సిద్ధమయ్యారని తెలుస్తోంది.