శుక్ర, శని, ఆదివారాల్లో 'రంగస్థలం' కుమ్మేసింది. బాక్సాఫీస్ వద్ద 'రంగస్థలం' వసూళ్ళ ప్రభంజనం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. 1980ల నాటి కథ, అప్పటి నేటివిటీతో కూడిన చిత్రీకరణ వంటివన్నీ 'రంగస్థలం' సినిమాపై కొన్ని అనుమానాల్ని కలగజేశాయి. అయితే రామ్‌చరణ్ లాంటి కమర్షియల్ హీరోతో సుకుమార్ సినిమా చేస్తున్నాడంటే అదేమీ అంత ఆషామాషీ విషయం కాదని 'రంగస్థలం' సినిమా టీజర్‌తోనే రుజువయ్యింది.
సినిమా విడుదలయ్యాక, అనుమానాలు మరింతగా పటాపంచలైపోయాయి. బాక్సాఫీస్‌ని 'రంగస్థలం' షేక్ చేసేస్తోంది. వీకెండ్ పూర్తయ్యింది. నేటితో, వసూళ్ళ వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుంది. ఓవర్సీస్‌లో (అమెరికా) అయితే 2 మిలియన్లకు పైగా వసూళ్ళను సాధించి 'రంగస్థలం' సత్తా చాటింది. చరణ్ సినిమాలకి అక్కడ సీన్ తక్కువేనన్నవారికీ ఈ సినిమా గట్టి సమాధానమే ఇచ్చింది. 80 కోట్ల పైన ప్రీ రిలీజ్ బడ్జెట్ టాక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రంగస్థలం' నిర్మాతలకు అంచనా వేసినదానికంటే ముందే ప్రాఫిట్స్ తీసుకురానున్నాయని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు.
అవన్నీ పక్కన పెడితే, 'ఓ మంచి సినిమా తీశారు' అన్న ప్రశంస కంటే ఇంకేదీ గొప్ప కాదు. ఆ ప్రశంస ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్‌కి దక్కేసింది. నటుడిగా చరణ్‌కీ, దర్శకుడిగా సుకుమార్‌కీ అందుతున్న ప్రశంసలు ఓ రేంజ్‌లో వున్నాయి. ఈ రోజూ బాక్సాఫీస్ వద్ద 'రంగస్థలం' జోరు మాత్రం తగ్గేలా కన్పించడంలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఆల్‌మోస్ట్ ఫుల్ అయిపోయాయని తెలుస్తోంది.