చిత్రసీమకు ఉన్న ఎన్నో సమస్యల్లో `లీకుల బెడద` ఒకటి. చిత్ర బృందం విడుదల చేయకుండానే పాటలూ, ఫొటోలూ, కొన్ని కొన్నిసార్లు సినిమాలోని సన్నివేశాలు బయటకు వచ్చేస్తుంటాయి. దాంతో.. దర్శక నిర్మాతలు పడుతున్న కష్టం అంతా వృథా అయిపోతుంటుంది. రామ్ చరణ్ సినిమాకీ ఇప్పుడు ఆ సమస్య తప్పలేదు.
చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం గోప్యంగానే ఉంచుతున్నారు. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదు. ఈలోగా లీకులు మొదలైపోయాయి. చరణ్ రెట్రో క్యారెక్టర్‌కు సంబంధించిన స్టిల్స్ కొన్ని బయటకు వచ్చేశాయి. వాటిలో అంజలి కూడా ఉంది. చరణ్, అంజలి.. భార్యాభర్తలుగా నటిస్తున్నారన్న విషయం.. ఆ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. అలా.. కథలోకి ఓ కీలక విషయం చిత్ర బృందం చెప్పక ముందే బయటకు వచ్చేసింది.
ఈ లీకుల విషయమై శంకర్ కంగారు పడుతున్నాడట. అసలు కీలకమైన ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో ఆరా తీస్తున్నాడట. ఇందుకు సంబంధించిన కారకులు ఎవరైనా సరే, వాళ్లపై చర్య తీసుకోవాలని దిల్ రాజుని కోరాడట శంకర్. దిల్ రాజు కూడా లీకుల విషయంలో గుర్రుగానే ఉన్నాడని టాక్. ఓ సహాయ దర్శకుడి వల్లే ఈ ఫొటోలు లీకయ్యాయని తెలిసింది. వెంటనే తనని టీమ్ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి.