చిరంజీవి - కొరటాల కాంబినేషన్ లో `ఆచార్య` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.చిరు -చరణ్ గురు శిష్యులుగా నటిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కథలో ఓ అనూహ్యమైన మార్పు వచ్చిందని టాక్. దాని ప్రకారం చరణ్‌పాత్ర నిడివి తగ్గించేశారని చెప్పుకుంటున్నారు. నిజానికి 45 నిమిషాల నిడివి గల పాత్ర చరణ్ ది. ఆ పాత్ర అంత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దారు. చిరు - చరణ్ పై ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పాత్ర నిడివి బాగా తగ్గిందని టాక్. దానికి కారణం కరోనానే. లాక్ డౌన్ నిబంధనల వల్ల షూటింగులు మొదలెట్టే అవకాశాలు లేకుండా పోయాయి. దాని వల్ల అన్ని షూటింగులూ ఆగిపోయాయి.
ఆర్.ఆర్.ఆర్ పనులు పూర్తయితే గానీ ఆచార్య షూటింగుకు కాల్షీట్లు కేటాయించలేడు చరణ్. అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. అది పూర్తయ్యాకే... ఆచార్య మొదలవుతుంది. చరణ్ కోసం అప్పటి వరకూ చిత్రబృందం ఎదురు చూడాల్సిందే. అందుకే ఎందుకైనా మంచిదని, చరణ్ పాత్ర నిడివి తగ్గించేశార్ట. చరణ్ కాల్షీట్లు దొరికిన వెంటనే.. అతి ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత... సమయం ఉంటే,మిగిలిన సీన్లు తీస్తారు. లేదంటే లేదు. ఆగస్టులో ఆచార్య షూటింగ్ ప్రారంభం అవ్వడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎప్పుడు మొదలవుతుందో, చరణ్ ఎప్పుడు డేట్లు ఇస్తాడో చూడాలి.