`ఆర్.ఆర్.ఆర్` ముగిసిన వెంటనే శంకర్ తో సినిమా మొదలెట్టేయాలన్న ఆలోచనలో ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమాపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ... శంకర్ స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయాడు. ఇప్పటికే.. కథేంటో చరణ్ కి వినిపించేశాడు. ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో శంకర్ బిజీ అయ్యాడని తెలుస్తోంది.
శంకర్ సినిమాలెప్పుడూ భారీగానే ఉంటాయి. చిన్న పాత్రకి సైతం పేరున్న నటీనటులనే ఎంచుకుంటాడు. ఇందులోనూ అంతే. ఈ చిత్రంలో చరణ్ పక్కన ముగ్గురు హీరోయిన్లుంటారు. అందులో ఒకర్ని బాలీవుడ్ నుంచి, ఇంకొకర్ని టాలీవుడ్ నుంచి తీసుకుంటారు. మూడో హీరోయిన్ ఇప్పటికే ఫిక్సయిపోయిందని తెలుస్తోంది. ఆ స్థానంలో మాళవిక మోహనన్ ని ఎంచుకున్నార్ట.
ఈ సంక్రాంతికి విడుదలైన `మాస్టర్` సినిమాతో మాళవిక మోహనన్ ఓ కీలక పాత్ర పోషించింది. అందులో మాళవిక హీరోయిన్ కానప్పటికీ ఆ పాత్రకు ఆ రేంజ్ ఇచ్చారు. నటన, గ్లామర్ పరంగా.. తనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే శంకర్ దృష్టిలో పడిపోయింది. మరి మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.