రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `భారతీయుడు 2` అయ్యాకే.. శంకర్ ఈ సినిమాని పట్టాలెక్కిస్తాడు. అయితే అనుకోకుండా `భారతీయుడు 2`కి బ్రేక్ పడింది. ఈ సమయాన్ని.. చరణ్ ప్రాజెక్టు కోసం కేటాయించాడు శంకర్. దాంతో.. చరణ్ సినిమా పనులన్నీ చక చక ముందుకు సాగుతున్నాయి. ఈ సినిమాలోని ప్రధాన తారాగణం, ఇతర సాంకేతిక వర్గం విషయంలో ఇప్పటికే శంకర్ ఓ అభిప్రాయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రైటర్ కూడా ఫిక్సయిపోయాడు.
బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో బుర్రాదే హవా ఇప్పుడు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రైటర్ కూడా ఆయనే. ఓ వైపు.. `ఆర్.ఆర్.ఆర్` లాంటి భారీ చిత్రాలకు పనిచేస్తూనే శ్రీకారం లాంటి చిన్న సినిమాలకూ తన మాట సాయం అందిస్తూ వస్తున్నారు. ఈ యేడాది క్రాక్ తో ఆయన ఖాతాలో మరో హిట్ పడింది. ఇప్పుడు చరణ్ సినిమాకీ ఆయన రైటర్ గా మారిపోయారు. ఈవారంలోనే చెన్నైలో కథా చర్చలు ప్రారంభం కానున్నాయని సమాచారం.