కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెం.150, సైరా, ఆచార్య... ఇలా వరుసగా చిరంజీవితోనే సినిమాలు చేస్తున్నాడు. `ఇది నాన్న కోసం పెట్టుకున్న బ్యానర్. బయటి వాళ్లతో సినిమాలు తీయను` అని తొలి రోజుల్లోనే గట్టిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నట్టు భోగట్టా. `కొణిదెల` సంస్థలో బయటి హీరోలతో సినిమాలు చేయడానికి రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడని టాక్. అయితే..భారీ సినిమాలు కాదు. చిన్న సినిమాలు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లో సాగే సినిమాలు మాత్రమే.
ఈమధ్య చిన్న సినిమాలకు మరింత గిరాకీ పెరిగింది. పెద్ద స్టార్లు.. చిన్న సినిమాలు తీస్తే.. వాటికి మరింత క్రేజ్. నానినే చూడండి. నిర్మాతగా మారి, చిన్న సినిమాలు తీస్తున్నాడు. వాటికి బోల్డంత క్రేజ్ వస్తుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. ఇదీ నాని స్ట్రాటజీ. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే ఫాలో కాబోతున్నాడట. కొత్త కథలు విని, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలని భావిస్తున్నాడట. అందులో భాగంగా కొన్ని కథల్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇందులో అంతా కొత్తవాళ్లే నటిస్తారు. థియేటర్, లేదంటే ఓటీటీలో విడుదల చేయడానికైనా చరణ్ రెడీనే అట. త్వరలోనే ఒకట్రెండు చిన్న సినిమాల్ని ఒకేసారి ప్రకటించాలని చరణ్ భావిస్తున్నట్టు సమాచారం.