`ఆర్.ఆర్.ఆర్` తరవాత మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదు రామ్ చరణ్. కొరటాల శివ `ఆచార్య`లో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నాడంతే. చరణ్ కోసం కొంతమంది దర్శకులు కథలు సిద్ధం చేసుకున్నా - ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓ యువ దర్శకుడి కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. అతనే వెంకీ కుడుముల. `చలో`, `భీష్మ` సినిమాలతో ఆకట్టుకున్నాడు వెంకీ కుడుముల. ఈ రెండు సినిమాలూ... చరణ్‌కి బాగా నచ్చాయట. `భీష్మ` చూశాక వెంకీని పిలిచి మాట్లాడాడట చరణ్.
`మంచి కథ సిద్ధం చేసుకో.. కలిసి సినిమా చేద్దాం` అని మాట ఇచ్చాడట. దాంతో వెంకీ కుడుముల కథ రెడీ చేయడం, చరణ్ కి వినిపించడం జరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు దాదాపు ఓకే అయిపోయినట్టే. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. `ఆర్.ఆర్.ఆర్` అవ్వగానే ఈ ప్రాజెక్టే ముందుకు వెళ్తుంది. `ఆర్.ఆర్.ఆర్` లాంటి పెద్ద ప్రాజెక్టు తరవాత.. ఓ చిన్న కథతో, సింపుల్ గా ఓ సినిమా చేయాలన్నది చరణ్ ప్లాన్. `మగధీర` తరవాత.. `ఆరెంజ్` చేసినట్టు. అందుకే వెంకీని దర్శకుడిగా ఫిక్స్ చేసుకున్నాడట.